ఇంద్రకీలాద్రి పై ఇన్‌స్టాగ్రామ్ రీల్ కలకలం..
యువతిపై పోలీసులకు ఫిర్యాదు
ఆలయ పవిత్రతకు భంగం కలిగించారంటూ దేవస్థానం చర్యలు
డ్యాన్స్ రీల్ చిత్రీకరించిన యువతిని గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధమని ఈవో వి.కె. శీనా నాయక్ వెల్లడి
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆక్షేపణీయంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరించిన ఘటనపై ఆలయ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఆలయ పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారని పేర్కొంటూ సంబంధిత యువతిపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేసినట్లు దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలోని మహామండపం ఏడో అంతస్తు రాజగోపురం వద్ద ఓ యువతి డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరించిన వీడియో సామాజిక మాధ్యమాలు, వార్తా ఛానళ్లలో ప్రసారం కావడంతో దేవస్థానం యంత్రాంగం దీనిని తీవ్రంగా పరిగణించింది. దేవాదాయ శాఖ నిబంధనలు, ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఈ చర్య జరిగిందని పేర్కొన్న ఈవో వి.కె. శీనా నాయక్ ఆదేశాల మేరకు దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదివారం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేశారు.
దేవస్థానం వివరాల ప్రకారం, సంబంధిత రీల్‌ను 2026 జూలై 30న మధ్యాహ్నం 1:45 నుంచి 1:47 గంటల మధ్య చిత్రీకరించినట్లు గుర్తించినట్లు తెలిపింది. వీడియోలో కనిపిస్తున్న యువతిని గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వెల్లడించింది. ఆలయ పవిత్రత, విశిష్టతను దెబ్బతీసే చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు దేవస్థానం కట్టుబడి ఉందని ఈవో వి.కె. శీనా నాయక్ స్పష్టం చేశారు.
