కుటుంబ సమేతంగా ఆలయ దర్శనం
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రప్రభ): ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని నగర పోలీసు కమిషనర్ సజ్జనర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో హైదరాబాద్ నగర పోలీసు శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాగ్యనగరంలో బోనాల పండుగకు విశిష్టమైన చారిత్రక నేపథ్యం ఉందని, నగరవ్యాప్తంగా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు విజయవంతంగా ముగియగా, ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా సుమారు 2,500 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిఘా వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు అనుసంధానంగా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తున్నామని, దీని ద్వారా పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే ఆలయంలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే భక్తుల సంఖ్యను క్యూ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తూ, రద్దీ సాంద్రతను థ్రెషోల్డ్ మ్యాపింగ్ ద్వారా నిరంతరం విశ్లేషించి తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పనిచేస్తున్నామని చెప్పారు. భక్తులందరూ పోలీసు శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ట్రాఫిక్-1 డీసీపీ అవినాశ్ కుమార్, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ తదితరులు

