వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి

రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని ఎస్సై సాయికిరణ్ సూచన

కడెం, ఆంధ్రప్రభ : ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని కడెం పోలీస్ స్టేషన్ ఎస్సై పి. సాయికిరణ్ సూచించారు.

ఆదివారం మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ప్రధాన రహదారిపై ఎస్సై సాయికిరణ్ ఆధ్వర్యంలో వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ), బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు, డ్రైవర్ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు.

రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. అలాగే మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.