తెలుగు నేల గర్వించదగ్గ మహనీయుడు పింగళి వెంకయ్య

  • మాజీ మంత్రి దేవినేని ఉమా
  • గొల్లపూడిలో త్రివర్ణ పతాక రూపకర్త 150వ జయంతి
  • నివాళులు అర్పించిన మాజీ మంత్రి

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: భారత జాతీయ జెండా రూపకల్పన ద్వారా కోట్లాది మంది భారతీయులను ఐక్యం చేసి దేశభక్తి భావనను ప్రపంచానికి చాటిన మహనీయుడు పింగళి వెంకయ్య సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా గొల్లపూడిలోని తన కార్యాలయంలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి పింగళి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. భారతజాతి కలలకు రూపమిస్తూ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్య దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచారని అన్నారు. మహాత్మా గాంధీ అభిమానాన్ని చూరగొని, తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేసిన ఆయన మన తెలుగు నేలలో జన్మించడం ప్రతి తెలుగువారికీ గర్వకారణమని పేర్కొన్నారు.

అధ్యాపకునిగా, రచయితగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా విశిష్ట సేవలందించిన పింగళి వెంకయ్య భారత జాతీయ పతాకాన్ని దేశానికి అందించి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. మన దేశ సార్వభౌమత్వానికి, సమైక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన జాతీయ జెండాను చూసిన ప్రతిసారి పింగళి వెంకయ్య త్యాగం, సేవలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఆ మహనీయుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధి, దేశసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా దేవినేని ఉమా పిలుపునిచ్చారు.