మొక్కజొన్నల దిగుమతి వేగవంతం చేయాలి
మొక్కజొన్నల దిగుమతి వేగవంతం చేయాలి
- ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు
కాల్వశ్రీరాంపూర్, ఆంధ్రప్రభ:
మొక్కజొన్నల దిగుమతి ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ఉన్న మొక్కజొన్నల దిగుమతి గోదామును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదాములో చెడిపోయిన సుమారు 20 వేల గన్ని సంచులు నిల్వ ఉండటాన్ని గమనించిన ప్రభుత్వ విప్, వాటిని వెంటనే తొలగించి మొక్కజొన్నల నిల్వకు మరింత స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
మార్కెట్ యార్డుకు వస్తున్న మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. గోదాములో నిరుపయోగంగా ఉన్న చెడిపోయిన సంచులను వెంటనే తొలగించడం ద్వారా కొత్తగా వచ్చే మొక్కజొన్నల నిల్వకు తగిన స్థలాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు తీసుకొచ్చే మొక్కజొన్నలు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. మార్కెట్ యార్డుల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి, కొనుగోలు కేంద్రాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది అలసత్వం ప్రదర్శించకుండా రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
