భారీ వర్షాల నేప‌థ్యంలో కీల‌క సూచ‌న‌

మధ్యాహ్నం 2 గంటల నుంచి విడతల వారీగా ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని సూచన
వీలైన సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంస్థలకు కీలక సూచనలు జారీ చేశారు. ఉద్యోగుల ప్రయాణ సమయంలో రహదారులపై వాహనాల రద్దీని తగ్గించేందుకు వీలైన అన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.

అలాగే, గురువారం (జూలై 30) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగులకు విడతల వారీగా (స్టాగర్డ్) ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని సూచించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ స్తంభించే పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున సంస్థలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ప్రయాణ ఇబ్బందులు తగ్గించడం, రహదారులపై ఒత్తిడిని నియంత్రించడం, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వంటి అత్యవసర సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ప్రజలు కూడా అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు.