పంట పొలాల దారిని వెంటనే పునరుద్ధరించాలి: రైతుల విజ్ఞప్తి
పంట పొలాల దారిని వెంటనే పునరుద్ధరించాలి: రైతుల విజ్ఞప్తి
డొంగ్లీ, ఆంధ్రప్రభ: పంట పొలాలకు వెళ్లే దారి ఆక్రమణకు గురవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న డొంగ్లీ గ్రామ రైతులు బుధవారం మండల తహసీల్దార్ రంజిత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో పూర్వం నుంచి ఉన్న సాంప్రదాయ పంట దారిని కొందరు అక్రమంగా ఆక్రమించి, దాని వెడల్పును కుదించడం, కొన్ని చోట్ల పూర్తిగా మూసివేయడం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలు పొలాలకు చేరుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
పంటల సాగు, వ్యవసాయ పనుల నిర్వహణపై ఈ సమస్య ప్రభావం చూపుతోందని రైతులు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులు, ఎఫ్ఎంబీ (FMB) ఆధారంగా సర్వే నిర్వహించి, అసలు హద్దులను నిర్ధారించాలని కోరారు. అక్రమ ఆక్రమణలను తొలగించి, పంట పొలాలకు వెళ్లే దారిని వెంటనే పునరుద్ధరించాలని తహసీల్దార్‌ను రైతులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ఓంకార్ పాటిల్‌తో పాటు రైతులు విఠల్, మోహన్, శ్రీపాల్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
