Bhogapuram | మోదీకి స్వాగతం పలికేందుకు కనివినీ ఎరుగని రీతిలో..

  • విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ..
  • భోగాపురం వేదికగా గిరిజన కళా మహోత్సవం..
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

భోగాపురం, ఆంధ్రప్రభ: అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక వద్ద నిర్వహించనున్న ధింసా నృత్య ప్రదర్శన సన్నాహకాలను సంబంధిత మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి పరిశీలించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా 13 వేల మంది గిరిజన బాలికలతో భారీ ధింసా నృత్య ప్రదర్శనను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజనుల సంప్రదాయ సంస్కృతి, కళారూపాలను ప్రతిబింబించేలా ఈ నృత్య ప్రదర్శనను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పాల్గొనే విద్యార్థినుల రిహార్సల్స్, వేదిక నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై మంత్రులు అధికారులతో సమీక్షించారు. కార్యక్రమం ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం రాష్ట్ర అభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలవనున్న నేపథ్యంలో, గిరిజన కళా వైభవాన్ని దేశానికి పరిచయం చేసే విధంగా ఈ భారీ ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.