గురజాల–కారంపూడి రూట్‌లో బస్సు రాక ఇబ్బందులు

పునరుద్ధరించాలని విద్యార్థులు, ప్రజల విజ్ఞప్తి

గురజాల, ఆంధ్రప్రభ: గురజాల–కారంపూడి రహదారిపై ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో నాలుగు గ్రామాల ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక ఆటో ప్రయాణాలపై ఆధారపడాల్సి వస్తుండటంతో ప్రయాణ భారం పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురజాల–కారంపూడి మార్గంలో జంగమహేశ్వరపురం, చర్లగుడిపాడు, లక్ష్మీపురం, ఒప్పిచర్ల గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ మార్గంలో ప్రస్తుతం ఆటోలే ప్రధాన రవాణా సాధనంగా మారాయి. ప్రయాణికులు పూర్తిగా నిండిన తర్వాతే ఆటోలు బయలుదేరుతుండటంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

అధిక వసూళ్లు..

కేవలం 18 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ఎక్కడ ఎక్కినా, ఎక్కడ దిగినా ఒకే చార్జీ వసూలు చేయడం వల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.

స్థానికుల వివరాల ప్రకారం.. 1986 నుంచి 2006 వరకు ఈ మార్గంలో వినుకొండ డిపో, మాచర్ల డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు నడిచేవి. అనంతరం కొంతకాలం ప్రైవేటు బస్సులు సేవలు అందించినప్పటికీ, 2008 తర్వాత బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ రహదారిలో ఆటో రవాణానే ఆధారంగా మారింది.

గురజాలలో ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు, కోర్టు, సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం, ఎల్‌ఐసీ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రజలు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల గురజాల–కారంపూడి రూట్‌లో ఆర్టీసీ బస్సు సర్వీసులను తక్షణమే పునరుద్ధరించాలని చర్లగుడిపాడు గ్రామ విద్యార్థులు, స్థానిక ప్రజలు మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మోహన్‌కృష్ణను కోరుతున్నారు.