టీచర్లే తెలంగాణ భవిష్యత్ శిల్పులు: సీఎం రేవంత్‌

ప్రభుత్వ విద్యలో ప్రపంచ స్థాయి సంస్కరణలు
విద్యతోనే పేదరికానికి శాశ్వత ముగింపు
ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్దాం
ఫిన్‌లాండ్, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి..

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుల బృందంతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థికి కేవలం చదువు అందించడం మాత్రమే కాకుండా, ప్రపంచంతో పోటీ పడే నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశ నిర్మాణంలో తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. విద్య సమాజంలో సమూల మార్పులకు పునాదిగా నిలుస్తుందని నెహ్రూ విశ్వసించారని, సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారని చెప్పారు. పంచవర్ష ప్రణాళికలు, హరిత విప్లవం వంటి సంస్కరణల ఫలితంగానే తెలంగాణ నేడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. అయినప్పటికీ ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు ఎందుకు మొగ్గుచూపుతున్నారో ఉపాధ్యాయులు ఆలోచించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష మందికి పైగా అదనపు విద్యార్థులు చేరడం ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, ఉపాధ్యాయులకు కూడా భోజన సౌకర్యం కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. ఉపాధ్యాయుల నియామకాలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించామని, ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా మార్చామని, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులను ఆ విశ్వవిద్యాలయం పాలక మండలిలోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

ఇంగ్లిష్ భాష మాత్రమే అభివృద్ధికి ప్రమాణం కాదని, చైనా వంటి దేశాలు తమ విద్యా విధానంతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పన్నెండో తరగతి పూర్తయ్యే నాటికి ప్రపంచంపై సమగ్ర అవగాహన కలిగేలా విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు.

ఉపాధ్యాయ సంఘాలు కేవలం ఉద్యోగుల సమస్యలకే పరిమితం కాకుండా విద్యార్థుల భవిష్యత్తుపైనా పోరాడాలని సీఎం సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అమలు చేయాల్సిన సంస్కరణలపై డిసెంబరు నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని కోరారు. ప్రతి మండలాన్ని ఒక విద్యా క్లస్టర్‌గా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ప్రభుత్వ బాధ్యతేనని, విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మాదిరిగానే ప్రతి ఏడాది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

రాజకీయాల కోసం కాకుండా, తెలంగాణలో నాణ్యమైన విద్యా వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే ప్రభుత్వ విద్యా వ్యవస్థను తెలంగాణలో నిర్మించేందుకు ఉపాధ్యాయులందరూ ఐదేళ్లపాటు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.