తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద
ఛత్తీస్‌గఢ్ వర్షాల ప్రభావం.. తాలిపేరులో జలకళ
గోదావరిలోకి 98 వేల క్యూసెక్కుల నీటి విడుదల
తాలిపేరు ఉద్ధృతి.. అధికారుల అప్రమత్తత
భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ: ఎగువన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై 24 గేట్లను ఎత్తి 98,761 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టులోకి 93,632 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, రిజర్వాయర్ నీటిమట్టం 72.57 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కావడంతో వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నివసించే వారు నది, వాగులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
