నీట్ నిరసనకారులపై కేసులు ఎత్తివేత
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిర్వహించిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులకు ఢిల్లీ ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులను మూసివేయాలని నిర్ణయించింది. అలాగే నేర చరిత్ర లేని నిరసనకారులపై ఎలాంటి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖ ప్రధాన కార్యదర్శి సంతోష్ డి. వైద్య అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలించిన అనంతరం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, నీట్ నిరసనల్లో పాల్గొన్న వారిపై ఢిల్లీ పోలీసు పరిధిలోని అధికారులు ఇకపై ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టరాదు. అయితే ఇప్పటికే నేర చరిత్ర (క్రిమినల్ యాంటిసిడెంట్స్) ఉన్న వ్యక్తులకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేశారు.
నిరసనల సందర్భంగా అరెస్టు చేసిన లేదా అదుపులోకి తీసుకున్న వారిపై నమోదైన కేసులను తక్షణమే సమీక్షించి, వీలైనంత త్వరగా విడుదల ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్తులో ఈ కేసులపై ఎలాంటి తదుపరి విచారణలు కొనసాగించకుండా పూర్తిగా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
నీట్ పరీక్ష అక్రమాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జూలై 29 సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ పోలీసులు మొత్తం 13 కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయంతో ఆ కేసుల భయం నుంచి విద్యార్థులు, నిరసనకారులకు ఊరట లభించింది.
