బంగారు వ్యాపారి ఇంట్లో రూ.60 లక్షల చోరీ
- 350 గ్రాముల బంగారం, విలువైన వస్తువుల అపహరణ
- సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు
దాచేపల్లి, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని నారాయణపురంలో బంగారు వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడు స్వామి శ్రీనివాసరావు ఇంట్లోకి చొరబడిన దుండగులు సుమారు 350 గ్రాముల బంగారంతో పాటు పలు విలువైన వస్తువులను అపహరించినట్లు సమాచారం. చోరీకి గురైన ఆస్తి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో అనుమానితుడి కదలికలు నమోదైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టారు.
