ట్రైనీ ఐపీఎస్ వ్యవహారం సంచలనం
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..ప్రేమగా మారి
మనస్పర్థల తర్వాత వేధింపులు
ఆత్మహత్య బెదిరింపులు, ఆయుధాలు చూపి భయపెట్టినట్లు ఆరోపణలు
అత్తాపూర్ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
చివరకు కటకటాలపాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డిపై ఓ యువతి చేసిన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. గత ఏడాది మధ్యలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాధితురాలికి ఉదయ్ కృష్ణారెడ్డి పరిచయమయ్యాడు. సివిల్స్ పరీక్ష కోసం తాను పడిన కష్టాలను వివరిస్తూ మెసేజ్‌లు పంపడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అనంతరం శిక్షణ సమయంలో ఈ పరిచయం మరింత సన్నిహితంగా మారింది.
అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో బాధితురాలు అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను నిరంతరం వేధించడం ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. సోషల్ మీడియా ద్వారా అసభ్యకర సందేశాలు పంపడం, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం, ఆయుధాలు చూపిస్తూ భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది.
అంతేకాకుండా తనకు ఇతర వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేయడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురైన బాధితురాలు చివరకు మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో ఈ ఏడాది జూలై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం ప్రస్తుతం విచారణలో ఉండగా, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.
