చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
నూతన 100 పడకల ఆస్పత్రి పనులను వేగవంతం చేయాలని ఆదేశం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం రాత్రి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. రాత్రి వేళ ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే, అక్కడి పరిసరాలను మరియు వివిధ విభాగాల రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో పాటు చికిత్స పొందుతున్న పేషంట్లతో స్వయంగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
100 పడకల ఆసుపత్రి నిర్మాణంపై సమీక్ష చౌటుప్పల్ పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. భవన నిర్మాణం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, మిగిలి ఉన్న రోడ్ల నిర్మాణం, పరిసరాల శుభ్రత తదితర పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆసుపత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు మహమ్మద్ హన్ను, దేప రమ్య రాజు, ఉడుగు జ్యోతి రమేష్ లతో పాటు పలువురు స్థానిక నాయకులు, ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
