సింగరేణి గని కార్మికుల సమస్యలపై నిరంతర ఉద్యమం
సింగరేణి గని కార్మికుల సమస్యలపై నిరంతర ఉద్యమం
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి
- గోదావరిఖని జిఎం కార్యాలయంలో ధర్నా
గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భారత రాష్ట్ర సమితి నిర్విరామంగా పోరాటం చేస్తుందని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి అన్నారు. శనివారం గోదావరిఖని పట్టణంలో కార్మికుల సమస్యలపై చేపట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేయడానికి హరి తప్పు పెట్టారు.

సమస్యను విన్నవించే హక్కు లేకుండా… పాదయాత్ర చేపట్టకుండా పోలీసులు ముందస్తుగా ఇంటి వద్ద నిర్బంధం చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. అయితే అనుకోని విధంగా కౌశిక్ హరి గోదావరిఖని సింగరేణి జిఎం కార్యాలయం కు భారత రాష్ట్ర సమితి శ్రేణులు, సింగరేణి మారు పేర్లు కార్మికుల వారసులతో కలిసి చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు. సింగరేణి జిఎం కార్యాలయం ముందు కౌశిక హరి శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ…
కేసీఆర్ హయాంలో మెడికల్ బోర్డు ద్వారా ప్రతి రెండు నెలలకు ఒకసారి వారసత్వ ఉద్యోగాల ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. దీనికి నిరసనగా చేపట్టిన పాదయాత్రను కూడా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.
సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. నిర్బంధ చర్యలు కొనసాగితే భవిష్యత్తులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం వల్ల కార్మికులు నష్టపోతున్నారని, దీనికి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత వహించాలని కౌశిక్ హరి డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జనగామ కవిత, నిమ్మ రాజుల రవి, చింతకింది సంపత్, కిషన్ రెడ్డి, గడ్డం శంకర్ తోపాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా కార్మికుల సమస్యలపై చేపడుతున్న పాదయాత్రను ముందస్తుగా అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా మాజీ కార్పొరేటర్ కౌశిక్ లతను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ధర్నా ఘటన స్థలికి గోదావరిఖని ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పోలీసు బలగాలతో చేరుకొని ఆందోళన కారులను వెళ్లగొట్టారు. అనంతరం కౌశిక్ హరి నేతృతంలో సింగరేణి అధికారికి వినతిపత్రం అందజేశారు.
