ఈశాన్య రాష్ట్రాల వరదలపై కేంద్రం అప్రమత్తం
- ప్రజల క్షేమమే లక్ష్యం.. వరదలపై మోదీ భరోసా
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఈశాన్య భారతంలో వరదలతో ప్రభావితమైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆయా రాష్ట్రాల ఎంపీలతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సహాయక చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. వరదలతో తలెత్తిన సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంగా పనిచేస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
సమావేశం అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఎంపీలతో వరద పరిస్థితులపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని వెల్లడించారు. వరదల ప్రభావానికి గురైన ప్రాంతాల ప్రజలందరూ క్షేమంగా, సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రధాని మోదీ ప్రార్థించారు.
