ఇండిగోతో కేంద్రం కీలక ఒప్పందం..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత పర్యాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర పర్యాటక శాఖ, దేశీయ విమానయాన సంస్థ ఇండిగో మధ్య కీలక ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ భాగస్వామ్యంతో ‘ఇన్క్రెడిబుల్ ఇండియా బై ఇండిగో’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి, దేశంలోని పర్యాటక విశేషాలను దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు విస్తృతంగా పరిచయం చేయనున్నారు.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశానికి ప్రపంచానికి చెప్పాల్సిన గొప్ప పర్యాటక కథ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం–ఇండిగో భాగస్వామ్యంతో ఆ కథను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రయాణికులకు చేరవేస్తామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా భారత పర్యాటకానికి ప్రచారం
ఇండిగో విస్తృత అంతర్జాతీయ విమాన నెట్‌వర్క్‌ను వినియోగించి భారతదేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి, ఆరోగ్య పర్యాటక కేంద్రాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రచారం ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు భారత పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ను ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యమైన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని షెకావత్ పేర్కొన్నారు. ‘బ్రాండ్ ఇండియా’ను మరింత బలోపేతం చేయడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
