అక్రమంగా నిల్వ చేసిన 5 గ్యాస్ సిలిండర్లు సీజ్

అక్రమంగా నిల్వ చేసిన 5 గ్యాస్ సిలిండర్లు సీజ్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన ఐదు గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు సీజ్ చేసిన ఘటన కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ పవన్ తెలిపిన వివరాల ప్రకారం, మండల కేంద్రంలోని భారతమాత విగ్రహం కాలనీలో నివాసం ఉంటున్న కావలి యాదగిరి ఇంట్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, చిన్న గ్యాస్ బుడ్డిల్లో గ్యాస్ నింపుతున్నారనే ఫిర్యాదు అందింది.

దీంతో అధికారులు తనిఖీలు నిర్వహించగా, అక్కడ ఐదు గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యాయి. వాటి నిల్వకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న గ్యాస్ సిలిండర్లను సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శరత్ కుమార్, జీపీవోలు కే. అశోక్, పి. అజయ్, కె. దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.