అక్రమాలపై ఉక్కుపాదం… హైడ్రా వెనక్కి తగ్గదు!

కరీంనగర్ గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశ్

వెయ్యి శుభాలు జరిగేటప్పుడు ఒక్కటి, రెండు ఆటంకాలు రావడం సహజం. ఒక మంచి పనికి మధ్యలో కొన్ని చట్టపరమైన, సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అంత మాత్రాన ఆ పని వెనక్కి తగ్గదు. ప్రజల ప్రయోజనం కోసం ప్రారంభమైన సంస్కరణలు, మధ్యలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగుతాయి.

హైడ్రా విషయంలో ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా ఇదే ప్రశ్నను ఎదుర్కొంటోందని సత్తు మల్లేశ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ హైకోర్టు ఇటీవల హైడ్రా వ్యవహారంపై కొన్ని చట్టపరమైన అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను నిర్వర్తించడం ఎంత ముఖ్యమో, ప్రజా ఆస్తులను పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత అని ఆయన అన్నారు. ఈ రెండు వ్యవస్థలు పరస్పర విరోధాలు కావని, రెండింటి లక్ష్యం కూడా ప్రజా ప్రయోజనమేనని అభిప్రాయపడ్డారు.

అందుకే న్యాయస్థానం సూచించిన అంశాలను ప్రభుత్వం గౌరవిస్తూ, చట్టబద్ధమైన విధానాలతో ప్రజా ఆస్తుల పరిరక్షణను మరింత బలంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ ఒకప్పుడు చెరువుల నగరమని సత్తు మల్లేశ్ గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా “సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్”గా గుర్తింపు పొందిన ఈ నగరం సహజ సంపదతో కళకళలాడేదని చెప్పారు. ప్రతి చెరువు ఒక జీవనాధారం, ప్రతి నాలా ఒక సహజ డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి ప్రభుత్వ భూమి భవిష్యత్ తరాల ఆస్తి అని పేర్కొన్నారు.

అయితే, అభివృద్ధి పేరుతో దశాబ్దాలుగా జరిగిన నిర్లక్ష్యం ఈ నగర సహజ స్వరూపాన్ని దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు పూడ్చబడ్డాయని, వాగులు మాయమయ్యాయని, నాలాలపై భవనాలు వెలిశాయని, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని అన్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తులు కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోయాయని పేర్కొన్నారు.

ఈ రోజు హైదరాబాద్ ఎదుర్కొంటున్న ముంపు సమస్యలకు, ట్రాఫిక్ సమస్యలకు, పర్యావరణ అసమతుల్యతకు ఇవే ప్రధాన కారణాలని నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 2020లో హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన వరదలు ఒక ప్రకృతి విపత్తు మాత్రమే కాదని, మన నిర్లక్ష్యానికి ప్రకృతి ఇచ్చిన హెచ్చరిక అని అభిప్రాయపడ్డారు.

నీరు వెళ్లే దారులను మనమే మూసివేస్తే, వర్షం వచ్చినప్పుడు నీరు తన దారిని తానే వెతుక్కుంటుందని ఆయన పేర్కొన్నారు. అది రోడ్లపైకి వస్తుందని, కాలనీల్లోకి చేరుతుందని, ఇళ్లను ముంచేస్తుందని, చివరకు ప్రాణనష్టానికి కూడా కారణమవుతుందని వివరించారు.

ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. పేరులోనే లక్ష్యం కనిపిస్తోందని, విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం అనే రెండు బాధ్యతలను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న ఆలోచనతో హైడ్రా ఏర్పడిందని పేర్కొన్నారు.

హైడ్రా కేవలం అక్రమ నిర్మాణాలు కూల్చే సంస్థ కాదని, దాని వెనుక ఒక పెద్ద ఆలోచన ఉందని సత్తు మల్లేశ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భూములను రక్షించడం, చెరువులను కాపాడటం, నాలాలను పునరుద్ధరించడం, ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన భూములను తిరిగి ప్రజలకే అందించడం, భవిష్యత్ తరాలకు సురక్షితమైన నగరాన్ని అందించడమే దీని లక్ష్యమని తెలిపారు.

ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ అధికారుల ఆస్తి కాదని, అది ప్రజల ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. అక్కడ రేపు ఒక ప్రభుత్వ పాఠశాల….రావచ్చని ఆయన పేర్కొన్నారు. ఒక ఆసుపత్రి రావచ్చు. ఒక పార్కు రావచ్చు. ఒక రహదారి నిర్మించవచ్చు. అందుకే ప్రభుత్వ భూములను కాపాడటం అంటే ప్రజల హక్కులను కాపాడటమేనని సత్తు మల్లేశ్ అభిప్రాయపడ్డారు.

హైడ్రా చర్యల్లో మరో ముఖ్యమైన అంశం చెరువుల పరిరక్షణ అని ఆయన పేర్కొన్నారు. చెరువు అనేది కేవలం నీటి నిల్వ కేంద్రం కాదని, అది ప్రకృతి నిర్మించిన వరద నియంత్రణ వ్యవస్థ అని వివరించారు. భూగర్భ జలాలను నింపే జీవనాడిగా, పర్యావరణ సమతుల్యతకు ఆధారంగా చెరువులు నిలుస్తాయని చెప్పారు.

అలాంటి చెరువులను ఆక్రమిస్తే నష్టపోయేది ప్రకృతి మాత్రమే కాదని, మొత్తం నగరమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే నాలాల విషయానికొస్తే, వర్షపు నీరు వెళ్లే సహజ మార్గాలను మూసేస్తే వరదలను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. అందుకే నాలాల పునరుద్ధరణ అనేది అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అది నగర రక్షణకు అవసరమైన చర్య అని వివరించారు.

హైడ్రా బాధ్యతలను నిర్వహించే క్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ.వీ. రంగనాథ్ పేరు ప్రజల్లో విస్తృతంగా చర్చకు వచ్చిందని సత్తు మల్లేశ్ పేర్కొన్నారు. ఆయన మంచి పేరున్న అధికారని చెప్పారు. కింది స్థాయిలోని సిబ్బంది చేసిన చిన్నచిన్న సాంకేతిక కారణాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

పోలీసు శాఖలో ఏ.వీ. రంగనాథ్‌కు క్రమశిక్షణ, నిజాయితీ, చట్టం పట్ల నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. హైడ్రా ద్వారా ప్రజా ఆస్తుల పరిరక్షణలో ఆయన చూపిన చొరవను ప్రభుత్వం పలుమార్లు ప్రశంసించిందని గుర్తు చేశారు.

ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థే ముఖ్యమని సత్తు మల్లేశ్ అన్నారు. ఒక అధికారి వస్తారని, మరొక అధికారి వెళ్తారని, ప్రభుత్వాలు మారతాయని, పదవులు మారతాయని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ భూములు మాత్రం ప్రజలవేనని, చెరువులు ప్రజలవేనని, నాలాలు ప్రజలవేనని స్పష్టం చేశారు.

వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎప్పటికీ మారదని ఆయన అభిప్రాయపడ్డారు.
హైడ్రాపై రాజకీయాలు చేయడం సులభమేనని, కానీ ఒక్కసారి ప్రతి ఒక్కరూ తమ మనసును తాము ప్రశ్నించుకోవాలని సత్తు మల్లేశ్ అభిప్రాయపడ్డారు. చెరువులు ఆక్రమించబడకూడదా? ప్రభుత్వ భూములు కబ్జా కాకూడదా? నాలాలపై అక్రమ నిర్మాణాలు కొనసాగాలా? ప్రతి వర్షానికి హైదరాబాద్ మళ్లీ మునిగిపోవాలా? అనే ప్రశ్నలను ఆయన లేవనెత్తారు.

ఈ ప్రశ్నలకు సమాధానం “కాదు” అయితే, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ఒక బలమైన వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే, అదే సమయంలో ఆ వ్యవస్థ చట్టబద్ధంగా, పారదర్శకంగా, ప్రజల హక్కులను గౌరవిస్తూ పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఇదే రాజ్యాంగం చెప్పే మార్గమని పేర్కొన్నారు.

ప్రభుత్వం కూడా ఈ సూత్రాన్నే అనుసరిస్తూ హైడ్రాను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దాలని సత్తు మల్లేశ్ సూచించారు. హైదరాబాద్‌ను కాపాడాలంటే చెరువులను కాపాడాలని, చెరువులను కాపాడాలంటే ఆక్రమణలను అడ్డుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూములను రక్షించాలని, నాలాలను స్వేచ్ఛగా ప్రవహించేలా చేయాలని సూచించారు. ఇదే హైడ్రా వెనుక ఉన్న అసలు ఆలోచన అని పేర్కొన్నారు.

చట్టపరమైన సవాళ్లు వస్తాయని, కోర్టులు తమ మార్గదర్శకాలు ఇస్తాయని, ప్రభుత్వం వాటిని పాటిస్తూ అవసరమైన మార్పులు చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ప్రజా ఆస్తుల పరిరక్షణ అనే లక్ష్యం మాత్రం ఎప్పటికీ బలహీనపడకూడదని స్పష్టం చేశారు.

ఎందుకంటే, ఒక చెరువును కాపాడటం అంటే ఒక నగరాన్ని కాపాడటమేనని, ఒక ప్రభుత్వ భూమిని రక్షించడం అంటే రేపటి తరాల హక్కులను రక్షించడమేనని ఆయన పేర్కొన్నారు.

హైడ్రా చట్టబద్ధంగా, పారదర్శకంగా, మరింత సమర్థంగా కొనసాగాలని సత్తు మల్లేశ్ అభిప్రాయపడ్డారు. అదే హైదరాబాద్ భవిష్యత్తుకు నిజమైన రక్షణ కవచమని ఆయన పేర్కొన్నారు.