Rs7799-Crore : పెట్టుబ‌డులు ప‌ర‌వ‌ళ్లు Andhra Prabha Top Story

Rs7799-Crore : పెట్టుబ‌డులు ప‌ర‌వ‌ళ్లు Andhra Prabha Top Story

  • క‌ర్నూలు పైనే ఫోక‌స్
  • గుట్టపాడులో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు
  • రూ.300 కోట్లతో జ‌య ఆదిత్య రెడీ

( కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ)

కర్నూలు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) సమావేశంలో కర్నూలు జిల్లాకు చెందిన రెండు ప్రధాన పారిశ్రామిక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. గుట్టపాడు వద్ద వేల కోట్ల రూపాయల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుతో పాటు కర్నూలులో భారీ ఆహార ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి.

Rs7799-Crore :గుట్టపాడులో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు

కర్నూలు జిల్లా గుట్టపాడు వద్ద ఆగస్టు గ్రీన్ ఎనర్జీ సంస్థ రూ.7,799.96 కోట్ల పెట్టుబడితో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 150.90 ఎకరాల భూమిని ఎకరాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించాలని రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుండగా, ప్రత్యక్ష, పరోక్షంగా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశముంది. ప్రాజెక్టు అమల్లోకి వస్తే ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతానికి అనుబంధంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో కర్నూలు జిల్లా మరింత బలోపేతం కానుంది.

Rs7799-Crore : రూ.300 కోట్లతో జయ ఆదిత్య …

కర్నూలులో జయ ఆదిత్య ప్రైవేట్ లిమిటెడ్ రూ.300 కోట్ల పెట్టుబడితో ఆహార ఉత్పత్తుల పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా 350 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. రాష్ట్ర ఆహార ఉత్పత్తుల పరిశ్రమల పాలసీ–2024-29 ప్రకారం సంస్థకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని కమిటీ నిర్ణయించింది. వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న కర్నూలులో ఈ పరిశ్రమ ఏర్పాటుతో రైతుల ఉత్పత్తులకు విలువ జోడించే అవకాశాలు పెరగనున్నాయి.

Rs7799-Crore : ఓర్వకల్లు పైనే

ఇటీవలే ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌లో డేటా సెంటర్లు, లిథియం బ్యాటరీలు, సోలార్ ప్యానెల్ తయారీ వంటి హైటెక్ పరిశ్రమలకు వరుసగా ఆమోదాలు లభిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు గుట్టపాడు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, కర్నూలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లాలో పారిశ్రామిక వాతావరణం మరింత బలపడుతున్న సంకేతంగా పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి.

జిల్లా అభివృద్ధికి కొత్త ఊపు

ఒకవైపు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు, మరోవైపు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించడం వల్ల కర్నూలు జిల్లా పెట్టుబడిదారులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అనుబంధ పరిశ్రమలు, రవాణా, గిడ్డంగులు, లాజిస్టిక్స్, సేవారంగాల అభివృద్ధికి కూడా ఊతమివ్వనున్నాయని అధికారులు, పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.