ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌
మరో 18 గంటలు అప్రమత్తం!
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాల హెచ్చరిక..
విదర్భ నుంచి భారీ మేఘాల ప్రవాహం
ఈ రాత్రి వరకు అల్పపీడన ప్రభావం తీవ్రం
పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణపై ప్రభావం చూపుతున్న అల్పపీడనం ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో 12 నుంచి 18 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తున్న నిపుణులు హెచ్చరించారు. విదర్భ ప్రాంతం నుంచి భారీ వర్ష మేఘాలు తెలంగాణ వైపు కదులుతుండటంతో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వచ్చే మూడు గంటల పాటు విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతాయని, ఈ ప్రభావం కామారెడ్డి, మెదక్, సిద్ధిపేటలోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేశారు.

సంగారెడ్డి, ములుగు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్వల్పం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విడతల వారీగా స్వల్పం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.

ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం గరిష్ఠ స్థాయిలో ఉండటంతో గురువారం రాత్రి వరకు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని హెచ్చరించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

ఇక సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగనున్నాయి. మిగతా తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ స్వల్పం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.