Mothkur చిన్నారుల రక్షణకు సమష్టి కృషి అవసరం
Mothkur చిన్నారుల రక్షణకు సమష్టి కృషి అవసరం
- ఎంపీడీఓ బాలాజీ నాయక్
మోత్కూర్ (Mothkur), ఆంధ్రప్రభ: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీడీఓ బాలాజీ నాయక్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జస్ట్ రైట్స్ వారి సౌజన్యంతో, స్కోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అరవిందరాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ బాలాజీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా నివారణ, డ్రగ్స్ బారిన పడకుండా రక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, డ్రాప్అవుట్ల నివారణ వంటి అంశాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బాల్యం ప్రతి చిన్నారి హక్కు అని, ఆ హక్కులను కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
బడీడు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కునగళ్ల మల్లేశం, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అవిలిమల్లు, అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతి, బీసీ సంఘం ప్రతినిధి కలిమెల నర్సయ్య, టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు దర్శనం వెంకన్న, ఉపాధ్యాయుడు అక్కేనపల్లి రాంబాబు, బీసీ రిజర్వేషన్ సాధన సమితి మండల అధ్యక్షుడు శివార్ల శ్రీనివాస్, డాక్టర్ ఎల్. రఘువర్ధన్, నర్సింగరావు, స్కోప్ సంస్థ మండల కోఆర్డినేటర్ కురిమేటి యాదయ్య, ప్రతినిధి కె. అశ్విని, స్థానిక అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
