Bellampalle ‘సర్’ ముసుగులో ఓట్ల చోరీ జరుగుతోంది

Bellampalle ‘సర్’ ముసుగులో ఓట్ల చోరీ జరుగుతోంది

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శ

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘సర్’ (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ) ముసుగులో ప్రతిపక్షాలు బలంగా ఉన్న సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ అనుకూల ఓటర్ల తొలగింపునకు పాల్పడుతూ ఓట్ల చోరీ చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి జేబు సంస్థగా మారిందని విమర్శించారు.

గురువారం సాయంత్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆర్పీ గార్డెన్స్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా (సర్)పై నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, ఓటర్ల పేర్ల తొలగింపు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువల పతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

జాతీయ స్థాయిలో నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమైందని, ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ ఓట్ల చోరీని అడ్డుకునేందుకు బెల్లంపల్లి నియోజకవర్గంలోని బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి, కాంగ్రెస్ ఓటర్లను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అవినాష్ రెడ్డి, బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాసిపాక రాజేష్, బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply