మంగంపల్లిని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
మంగంపల్లిని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
- ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
పెద్దమందడి, ఆంధ్రప్రభ : పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.
గురువారం మంగంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు రోడ్డు భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, వర్షాకాలం నేపథ్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, వనమహోత్సవం, జల సంరక్షణ, పాఠశాలల సౌకర్యాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
మంగంపల్లిని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పైలట్ గ్రామంగా ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని, గ్రామంలో ఒక్క పూరిగుడిసె కూడా లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే గ్రామంలో నూతన గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తయిందన్నారు. గ్రామాభివృద్ధికి తన వంతుగా రూ.10 లక్షలు కేటాయిస్తానని, జిల్లా కలెక్టర్ సహకారంతో మరో రూ.10 లక్షలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే గ్రామంలోని ప్రతి ఇంటికి సీఎస్ఆర్ నిధులతో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రతి కుటుంబం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ప్రతి శుభకార్యానికి కనీసం ఐదు మొక్కలు నాటే సంప్రదాయాన్ని ప్రారంభించాలని సూచించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించి పామాయిల్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు వచ్చిన సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్యలు తగ్గుతాయని చెప్పారు.
అలాగే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల కుటుంబ సభ్యులు మరణించిన పక్షంలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రూ.20 వేల ఆర్థిక సాయం పొందవచ్చని తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొని సహకరించాలని సూచించారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, బాల్యవివాహాలకు దూరంగా ఉండి బాలికలకు ఉన్నత విద్య అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్య అతిథులు గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీడీవో పరిణత, ఎస్సై జలంధర్ రెడ్డి, గ్రామ నాయకులు వెంకట్రామారెడ్డి, సర్పంచులు చిట్యాల వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొత్తకాపు వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ నాయకులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
