జూన్ 20న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ..
నాగర్‌కర్నూలు, ఆంధ్రప్రభ జిల్లా ప్రతినిధి : జూన్ 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు నాగర్‌కర్నూలు జిల్లా జడ్జి బి. రమాకాంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సమావేశ మందిరంలో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్సో జడ్జి నజీమా సుల్తానా, సబ్ జడ్జి శ్రీదేవితో కలిసి ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మూడు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, గతంలో కంటే అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. ఎన్నికల కారణంగా కొంతకాలం ప్రక్రియ మందగించినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.
లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు ఎలాంటి ఖర్చు లేకుండా, సులభంగా, నష్టం లేకుండా రాజీ పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. చిన్నచిన్న వివాదాలను పక్కన పెట్టి రాజీ కుదుర్చుకోవడం మంచి పరిణామమన్నారు. కోర్టు కేసుల వల్ల ఇప్పటికే ఎంతో విలువైన సమయం వృథా అవుతోందని, ఆలస్యంగా రాజీ చేసుకోవడం కంటే ముందుగానే పరిష్కారం చేసుకోవడం మంచిదన్నారు.
లోక్ అదాలత్ ప్రక్రియలో భాగంగా సీనియర్ న్యాయవాదులకు మధ్యవర్తిత్వ శిక్షణ ఇచ్చామని, వారి సహకారంతో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేసుల కారణంగా ప్రజలు ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రశాంత జీవనం కోసం రాజీ పరిష్కారాలు అవసరమన్నారు.
నాగర్‌కర్నూలు జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అతిపెద్ద జిల్లాగా ఉండగా, ప్రస్తుతం జిల్లాలో సుమారు 15 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. మధ్యవర్తిత్వం ద్వారా జిల్లాలో అత్యధిక శాతం కేసులు విజయవంతంగా పరిష్కారమయ్యాయని, గతంలో 37 కేసులు మధ్యవర్తిత్వంతో పరిష్కరించామని తెలిపారు.
కమ్యూనిటీ మీడియేషన్‌కు చట్టబద్ధత లభించిందని, గ్రామాల్లో గౌరవ స్థానం కలిగిన వ్యక్తులకు శిక్షణ ఇచ్చి కమ్యూనిటీ మీడియేటర్లుగా ఎంపిక చేస్తామని చెప్పారు. ముఖ్యంగా భూ, కుటుంబ తగాదాలు అధికంగా ఉన్న నేపథ్యంలో అహంకారాన్ని పక్కన పెట్టి రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్సై గోవర్ధన్ పాల్గొన్నారు.
