చంద్రబాబు తెచ్చిన ఎత్తిపోతల పథకాలే రైతాంగానికి జీవనాధారం

మాజీ మంత్రి దేవినేని ఉమా

  • ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి
  • సూపర్ సిక్స్ హామీలను సమర్థంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

కంచికచర్ల, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన వేదాద్రి, ముక్త్యాల, చింతలపూడి ఎత్తిపోతల పథకాలే నేడు రైతాంగాన్ని ఆదుకుంటూ వ్యవసాయానికి జీవనాధారంగా నిలిచాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. రూ.4,000 వృద్ధాప్య పెన్షన్ ద్వారా పెద్దల ఆత్మగౌరవాన్ని కూటమి ప్రభుత్వం మరింత పెంచిందన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి తల్లికి “తల్లికి వందనం” పథకాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, 20 లక్షల ఉద్యోగాల కల్పన వంటి సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రతి ఇంటికీ చేరవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.