భగవాన్ కుటుంబానికి న్యాయం చేసారా

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై జనసేన నేతల తీవ్ర విమర్శలు..
కాపు ద్రోహిగా వ్యవహరించారని ఆరోపణ
శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య కేసును మళ్లీ తెరపైకి తెచ్చిన కుటుంబ సభ్యులు..
పవన్ కళ్యాణ్‌పై కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు

విజయవాడ, ఆంధ్రప్రభ : మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటన మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లీలా కృష్ణ, బాధిత కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు పాల్గొని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఘటన సమయంలో అధికారంలో ఉన్న నాయకులు బాధిత కుటుంబానికి అండగా నిలవలేదని విమర్శించారు. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లీలా కృష్ణ మాట్లాడుతూ 2022లో జరిగిన ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటనలో న్యాయం కోసం కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిందన్నారు.

అయితే అప్పటి అధికార యంత్రాంగం ఆందోళనకారులపై కేసులు నమోదు చేసి నిర్బంధించిందని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన నాయకులు మౌనం వహించారని, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుటుంబానికి అండగా నిలవలేదని విమర్శించారు. భగవాన్ తల్లి ప్రగడ కుమారి మాట్లాడుతూ తన కుమారుడు శ్రీకృష్ణ భగవాన్ పట్ల కొందరు అధికారులు, కళాశాల యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు.

న్యాయం కోసం పోరాడుతున్న సమయంలో తమ కుటుంబాన్ని ఒంటరిగా వదిలేశారని, కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిళ్లు తెచ్చారని పేర్కొన్నారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్పందించని తోట త్రిమూర్తులు ఇప్పుడు కాపుల గురించి మాట్లాడటం విచారకరమని ఆమె విమర్శించారు. భగవాన్ సోదరుడు ప్రగడ వెంకటేష్ మాట్లాడుతూ తమ కుటుంబాన్ని రాజీ చేసేందుకు ప్రలోభాలు చూపారని ఆరోపించారు. న్యాయం కోసం నిలబడిన వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే నాయకులు తమ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు.

తోట త్రిమూర్తులను కాపు ద్రోహిగా పరిగణిస్తున్నామని వ్యాఖ్యానించారు. రామచంద్రపురం జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ లక్ష్యం కులాలను కలపడం మాత్రమేనని పేర్కొన్నారు. కాపు సమాజం పేరుతో రాజకీయాలు చేస్తున్న నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. భగవాన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని జనసేన నాయకులు స్పష్టం చేశారు.