శాకంబరి దేవిగా శ్రీ గంగాలమ్మ అమ్మవారు

శోభాయమానంగా ఆషాడ మాస పూజలు

నర్సాపురం, ఆంధ్రప్రభ: నరసాపురం మండలం ఎల్.బి.చర్ల గ్రామ దేవత, గ్రామస్థుల ఇలవేలుపు, చల్లని తల్లీ శ్రీ గంగాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాడ మాస సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల తాజా కాయగూరలతో అలంకరించి, ‘శాకంబరి దేవి’గా తీర్చిదిద్దారు. శోభాయమానంగా జరిగిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

అమ్మవారిని దర్శించి కునేందుకు భక్తులు క్యూ కట్టారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమాలు భక్తులలో భక్తిభావాన్ని నింపాయి.ఉత్సవాల్లో భాగంగా భక్తులు బైనపాలెం సెంటర్ నుండి ఆలయం వరకు మేళాతాళాలు, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆషాడం సారే, చీరలను సమర్పించారు.

ఈ వేడుకల్లో నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సతీమణి సునీత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.