న్యాయం చేయండి..

  • భర్త మృతి తర్వాత పిల్లలతో పుట్టింటికి వెళ్లిన గిరిజన మహిళ..
  • తిరిగి వచ్చేసరికి ఇంటికి వేరే తాళం..
  • రూ.40 వేల అప్పు పేరుతో తనకు తెలియకుండా ఇల్లు విక్రయించారని ఆరోపణ..
  • పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదంటూ ఆవేదన.

కేవీబీ పురం, ఆంధ్రప్రభ: కేవీబీ పురం మండలంలోని అంజూరు గిరిజన కాలనీలో ఓ గిరిజన మహిళకు చెందిన ఇంటిని ఆమెకు తెలియకుండా విక్రయించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రూ.40 వేల అప్పు పేరుతో మాజీ సర్పంచ్ భర్త తన ఇంటిని రూ.2 లక్షలకు విక్రయించారని బాధితురాలు ఆరోపిస్తూ న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటోంది.

బాధితురాలు నందిని తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త శీనయ్యతో కలిసి మాజీ సర్పంచ్ భర్త సురేష్ వద్ద రూ.40 వేల అప్పు తీసుకున్నారు. తమ వద్ద ఉన్న సొమ్ముతో పాటు ఆ అప్పుతో పక్కా ఇల్లు నిర్మించుకుని నివాసం ఉండేవారు. అయితే కొంతకాలం క్రితం భర్త మృతి చెందడంతో మనస్తాపానికి గురైన నందిని, ఇద్దరు చిన్నారులతో కలిసి కోడూరులోని తన తల్లి ఇంటికి వెళ్లింది.

కొద్ది రోజుల తర్వాత తిరిగి స్వగ్రామానికి వచ్చేసరికి తన ఇంటికి వేరే తాళం వేసి ఉండటాన్ని చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది. విచారణ చేయగా రూ.40 వేల అప్పు పేరుతో తనకు తెలియకుండా ఇంటిని రూ.2 లక్షలకు విక్రయించారని తెలిసిందని ఆమె ఆరోపించింది.

ఈ విషయమై సురేష్‌ను ఫోన్‌లో ప్రశ్నించగా తాను చెప్పిన సమాధానాలతో అసలు విషయం తెలిసిందని, అనంతరం న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపింది. అయితే రెండు రోజులైనా తన ఫిర్యాదుపై చర్యలు కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక ఇద్దరు చిన్నారులతో ఇబ్బందులు పడుతున్నానని, ఉన్నతాధికారులు స్పందించి తన ఇంటిని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.