వరద బాధితులకు అండగా జిల్లా యంత్రాంగం
ఏలూరు, ఆంధ్రప్రభ: గోదావరి వరదలతో రహదారి సంబంధాలు తెగిపోయి గ్రామాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు జిల్లా యంత్రాంగం అత్యవసర సహాయ చర్యలను కొనసాగిస్తోంది. ఆదివారం వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలకు అధికారులు బోట్లు, పడవల ద్వారా చేరుకుని త్రాగునీరు, కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
గోదావరి వరదల కారణంగా ఆయా గ్రామాలకు వెళ్లే రహదారులు నీటమునిగిపోవడంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల సిబ్బంది సమన్వయంతో బోట్లు, పడవలను వినియోగించి గ్రామాల్లోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారం రోజుల పాటు సరిపడే త్రాగునీరు, కూరగాయలు, నిత్యావసర సరుకులను అందజేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
