కృష్ణానదిలో శ్రీరాముడి పంచలోహ విగ్రహం లభ్యం…

కృష్ణానదిలో శ్రీరాముడి పంచలోహ విగ్రహం లభ్యం…

స్నానానికి దిగిన వారికి లభించిన విగ్రహం..
పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు..
చారిత్రక గుడిమెట్ల గ్రామంలో మరో అరుదైన విగ్రహం
ఆధ్యాత్మిక,పర్యాటక అభివృద్ధి కోరుతున్న గ్రామస్తులు

నందిగామ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణా నదిలో శ్రీరాముడి పంచలోహ విగ్రహం లభ్యమైంది. నదిలో స్నానం చేయడానికి దిగిన స్థానికులకు ఈ విగ్రహం కాళ్లకు తగలడంతో గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విగ్రహం ప్రాచీనత, మూలాలు తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది.

చారిత్రక ప్రాధాన్యం కలిగిన గుడిమెట్ల గ్రామం ఒకప్పుడు రాజులు పరిపాలించిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఏడు కోటలు, ఏడు పేటలతో 11వ శతాబ్దంలో రాజధానిగా విరాజిల్లిన ఈ గ్రామంలో గతంలో కూడా లక్ష్మీదేవి పంచలోహ విగ్రహం కృష్ణా నదిలో లభ్యమైంది. ఆ విగ్రహాన్ని గ్రామస్తులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. తాజాగా శ్రీరాముడి విగ్రహం లభించడం గ్రామానికి మరో ప్రత్యేకతను తీసుకువచ్చిందని స్థానికులు భావిస్తున్నారు. గుడిమెట్లను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply