‘ఇంటింటికీ కూటమి’ విజయాలే అజెండా

కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ అనంతరం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ‘ఇంటింటికీ కూటమి’ ప్రచార కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. క్లస్టర్ ఇన్‌చార్జులు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

గత ప్రభుత్వ వైఫల్యాలను వాస్తవాలతో ప్రజలకు వివరించడంతో పాటు, కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన, వేగవంతమైన అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు నూటికి నూరు శాతం కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేసి, ప్రజా మద్దతును మరింత బలోపేతం చేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.