వైకాపా ఆధ్వర్యంలో జెన్ జీ వార్ సమావేశం
- డిఎస్సీ పేపర్ లీకేజ్ బాధ్యతగా లోకేష్ రాజీనామా చేయాలి – వెలంపల్లి
- ఎన్నికల హామీల ప్రకారం నిరుద్యగులకు 3 వేల విడుదల చేయాలి – వెలంపల్లి
- కేవలం క్రీడలలో పాల్గొన్న సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వాలి – మల్లాది విష్ణు
- విద్య, వసతి దీవెన’ బకాయిలు రూ. 9,500 కోట్లు చెల్లించాలి – రాయన భాగ్యలక్ష్మి
చిట్టినగర్ , ఆంధ్రప్రభ: విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం భీమనవారిపేట పాల ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్ నందు విద్యార్థులు, యువకులు పార్టీ శ్రేణులతో జెన్ జీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు యువకులకు డిఎస్సీలో జరిగిన అక్రమాలను, అవకతవకల పైన జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ప్రదర్శించారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల గురించి రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్న బకాయిల వివరాలను పీపీటీ ద్వారా తెలియజేశారు. అనంతరం సమావేశానికి విచ్చేసిన కొందరు విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క సమస్యలను సమావేశ వేదిక మీద తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అథిధులుగా విచ్చేసారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డీఎస్సీ–2025 స్కామ్ పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెన్ జి యువత నిరుద్యోగులు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారన్నారు. డీఎస్సీ-2025 నిర్వహణలో తీవ్ర అక్రమాలు, ప్రశ్నా పత్రాల లీకేజీలు చోటు చేసుకున్నాయన్నారు. డీఎస్సీ కన్వీనర్ ను పక్కన పెట్టి, ఎస్సీ.ఈ.ఆర్టీ డైరెక్టర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించి పారదర్శకతను దెబ్బ తీశారన్నారు.
అత్యంత గోప్యమైన ప్రశ్నపత్రాల తయారీ, అప్ లోడింగ్ డిజిటల్ నిర్వహణ పనులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించి లీకేజీ కి బాటలు వేశారన్నారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పురమ నవీన్ సోషల్ స్టడీస్ లో కృష్ణా జిల్లా టాపర్ గా, టీజీటీ తెలుగులో జోన్–2 లో 6 వ ర్యాంకర్‌గా నిలవడం లీకేజీ ని స్పష్టంగా నిర్ధారిస్తోందన్నారు. అక్రమాలు బయటపడకుండా అతని పేరును మెరిట్ లిస్ట్ నుండి తొలగించి, డేటాను మాయం చేశారన్నారు. క్రీడా సంఘాల పగ్గాలు అధికార పార్టీ నేతలచేతిలోనే ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ,మల్లాది విష్ణు, రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. జీఓ 74 ప్రకారం ఉన్న 2% స్పోర్ట్స్ కోటాను జీఓ 4, 47 ద్వారా 3%కి పెంచి, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు పోటీ పరీక్ష రాయాలనే నిబంధనను ఎత్తి వేశారన్నారు. తమ వర్గానికి చెందిన అభ్యర్థులతో పోస్టులు నింపిన తర్వాత, మళ్లీ పాత నిబంధనలు తెస్తూ జీఓ 56 జారీ చేశారన్నారు. ఆర్చేరీ లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య వంటి ప్రతిభావంతుడు కి ఉద్యోగం ఇవ్వకుండా, కేవలం పాల్గొన్న సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఒక్కో టీచర్ పోస్టును రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షలకు విక్రయించిన ఆధారాలు బయటపడినా, నిందితులపై బలహీనమైన కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ పై వదిలేయడం వెనుక పెద్దల ప్రమేయం స్పష్టం అవుతోందని అన్నారు.
విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు రూ. 9,500 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, షేక్ అసిఫ్, పానుగంటి చైతన్య, కొరివి చైతన్య వర, మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, క్లస్టర్, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు విద్యార్థిని, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు
