పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
- డీసీసీ అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి డిమాండ్
కేసముద్రం, ఆంధ్రప్రభ:
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ , వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డీసీసీ అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం గ్రామంలో సోమవారం ఒక ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహమూద్‌పట్నం సర్పంచ్ కట్ల ఎల్లయ్య, సప్పిడిగుట్ట సర్పంచ్ బానోత్ బద్రు, భూక్యారం తండా సర్పంచ్ జాటోత్ సోమీలతో కలిసి అంబటి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేద ప్రజల అకౌంట్లలో వేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిందని, తీరా మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు వరకు ఓట్ల కోసం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచకుండా నిలిపివేసిన మోదీ ప్రభుత్వం.. ఎన్నికలు ముగియగానే ధరలను అడ్డగోలుగా పెంచేసి పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిందని ధ్వజమెత్తారు. దేశ ప్రజలను మరోసారి వంచించిన బీజేపీ ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
సామాన్యుడిపై పెరుగుతున్న ధరల భారం
ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇది దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరల భారంతో చిన్న చిన్న హోటళ్లు నడుపుకునే మధ్యతరగతి వ్యాపారులు వాటిని నిర్వహించలేక మూసివేసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. ఈ క్రమంలో “మోదీ హటావో.. దేశ్ కీ బచావో” అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ నిరసన పూరిత సమావేశంలో ఉపసర్పంచ్ అమృత శ్రీనివాస్, తౌరియా తండా ఉపసర్పంచ్ ధరావత్ మహేందర్, పార్టీ అధ్యక్షులు మిట్టగడుపుల యాకూబ్, జాటోత్ రమేష్, మాజీ ఎంపీటీసీ ముంజల శ్రీనివాస్, నేతలు వెంకటాచారి, మందుల ముత్తయ్య, భాషా మార్చు, కట్ల లచ్చమ్మ, బానోతు వీరు, తొగరి తిరుపతి, ఇస్లావత్ సంతోష్, సురేష్, కాంభోజి యాకయ్య, జాటోత్ రాము పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
