ప్రభుత్వ భూములు కబ్జాల నుండి కాపాడండి మహాప్రభో

ప్రభుత్వ భూములు కబ్జాల నుండి కాపాడండి మహాప్రభో

-ప్రజావాణిలో కలెక్టర్‌కు ఊట్కూర్ వాసుల ఫిర్యాదు

ఊట్కూర్, ఆంధ్రప్రభ:
“గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు, గ్రామ కంఠం భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. భూములను పరిరక్షించడంలో కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో గ్రామ అవసరాలకు కనీసం స్థలం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. దయచేసి ప్రభుత్వ భూములను కబ్జాల నుండి కాపాడండి మహాప్రభో..” అంటూ నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు స్థానికులు జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూర్ మండల కేంద్రంలోని 4వ వార్డులో గల ఉప్పరి ఆనంద్ అన్నదమ్ముల ఇంటి వెనక భాగంలో సుమారు 450 గజాల గ్రామ కంఠం ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తన సొంత స్థలంలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తున్న సజ్జన్ నీలి రాజు అనే వ్యక్తి.. పాఠశాల పక్కనే ఉన్న సదరు ప్రభుత్వ స్థలాన్ని ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) మరియు టాయిలెట్ల నిర్మాణం పేరుతో ఆక్రమించుకొని, తన సొంతానికి వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయమై గతంలో స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతోనే జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అవసరాలకు స్థలాలు కరవు!
గ్రామాల్లోని విలువైన ప్రభుత్వ స్థలాలు క్రమంగా కబ్జాల పాలవుతుండటంతో.. భవిష్యత్తులో అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సమాఖ్య భవనాలు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వైద్యాశాలలు తదితర ప్రజావసరాల కట్టడాలకు స్థలాలు దొరకకుండా పోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రెవెన్యూ అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించాలని, ప్రభుత్వ భూమి యొక్క అసలు హద్దులను గుర్తించి కబ్జా యత్నాలను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు.

నిర్మాణ పనులు నిలిపివేయాలని డీపీఓ ఆదేశం
ప్రజావాణిలో వచ్చిన ఈ ఫిర్యాదుపై జిల్లా పంచాయతీ అధికారి (DPO) తక్షణమే స్పందించారు. వివాదాస్పద స్థలంలో జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఊట్కూర్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రావును ఫోన్ ద్వారా ఆదేశించారు. అలాగే, సదరు స్థలానికి సంబంధించిన పూర్తి రికార్డులను, నివేదికను వెంటనే తమకు సమర్పించాలని సూచించారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పందించిన ఊట్కూర్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డీపీఓ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం అక్కడ పనులను నిలిపివేయించామని తెలిపారు. ఆ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు, నివేదికను మంగళవారం సమగ్రంగా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సమర్పిస్తామని ఆయన వెల్లడించారు.

Leave a Reply