కలెక్టర్ మార్క్ స్పష్టంగా..

కలెక్టర్ మార్క్ స్పష్టంగా..
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ లక్ష్యాల అమలుపై నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగుల పనితీరులో జవాబుదారితనం పెరిగేలా చర్యలు చేపడుతూ, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటనలు, సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో వేగం తీసుకురావడంపై కలెక్టర్ ఫోకస్ పెట్టారు. ఫలితాలపై ఆధారపడి పని చేసే విధానాన్ని ప్రోత్సహిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ‘బడిబాట’ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి అచ్చంపేట మండల విద్యాశాఖ అధికారి జీవన్‌కుమార్ గైర్హాజరు కావడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. మరో కొంతమంది అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ సమీక్ష సమావేశాల్లో స్పష్టం చేస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విద్యాశాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో తరచూ పాఠశాలల సందర్శనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇటీవలే నాగర్‌కర్నూల్ జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన హేమంత్ కేశవ్ పాటిల్ తనదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆలస్యంగా వచ్చిన అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసి వేతనాలు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
జిల్లా ఆసుపత్రిని ఉదయం 7 గంటలకే సందర్శించి మందుల కొరత, సిబ్బంది పనితీరు, పరిశుభ్రతపై సమీక్షించారు. పరిశుభ్రత లోపాలపై రోగులు చేసిన ఫిర్యాదులను స్వయంగా తెలుసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
మార్కెట్ యార్డులను సందర్శిస్తూ మొక్కజొన్న కొనుగోళ్లు, లారీల కొరత, ధాన్యం తరలింపు అంశాలపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమేర ఫలితాలు కూడా కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సమీక్ష సమావేశానికి హాజరుకాని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై కూడా కలెక్టర్ వెంటనే స్పందిస్తున్నారు. ఒక వృద్ధ మహిళ కుటుంబ సమస్యను స్వయంగా తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఉదయం నుంచే పనులు ప్రారంభిస్తూ ఉపాధి హామీ పథకం, మార్కెట్ యార్డులు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
