చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదీ
రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
ముడుమాల్ నిలువురాళ్ల ఎకో టూరిజం పార్కు అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన
ముడుమాల్ నిలువురాళ్ల ఏకో టూరిజం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ , ఆంధ్రప్రభ: చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ముడుమాల్ గ్రామంలో ఉన్న చారిత్రక నిలువురాళ్ల ఎకో టూరిజం పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ…

చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నిలువురాళ్ల పార్కును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.
ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ముడుమాల్ నిలువురాళ్ల పార్కుకు మరింత గుర్తింపు లభించడంతో పాటు పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు
ఈ సందర్బంగా దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్ మాట్లాడుతూ…
ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణం అని, యూనెస్కో శాశ్వత గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
నిలువురాళ్ల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది వరకు ఇక్కడ ఉన్న కలెక్టర్లు నిలువు రాళ్ళ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. యునెస్కో శాశ్వత గుర్తింపు కొరకు కొన్ని సూచనలు ఇచ్చారని వాటిని పాటించి గుర్తింపు పొందేలా కృషి చేయాలన్నారు. ఇదివరకే మంత్రి వాకిటి శ్రీహరి గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఇందుకు తగిన వసతులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలోని 400 పాఠశాలల హెడ్మాస్టర్లకు శిక్షణ ఇచ్చి దాదాపు 60 వేల మంది విద్యార్థులు మూడుమాల్ నిలువు రాళ్ళను సందర్శించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే 20 మంది టూరిస్ట్ గైడ్లను ఏర్పాటు చేసి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇందుకు తగిన మ్యాప్ తయారు చేయాలన్నారు. ప్రజలు భాగస్వాములై ఇక్కడి విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేలా అవగాహన కల్పించుకోవాలన్నారు. శాస్త్ర విజ్ఞానం రాకముందే 3 వేల సంవత్సరాల క్రితం నిలువురాళ్ల రూపంలో నక్షత్ర మండలాన్ని ఆనాడే రూపొందించారని తెలిపారు. మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో విశిష్టతను చాటేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ మణికొండ, అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి, సర్పంచ్ బాలరాజు, నర్సప్ప, తమ్మప్ప, వెంకటేశ్,అధికారులు రషీద్, వెంకటేశ్ శెట్టి, తహసీల్దార్,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
