మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ పట్టణంలోని నెల్లికొండ మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించి, అక్కడ కొనసాగుతున్న మొక్కజొన్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి మార్కెట్ యార్డులో రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తూకం విధానం, నాణ్యత ప్రమాణాలు, నిల్వ ఏర్పాట్లు, రవాణా సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న బీహార్‌కు చెందిన కూలీలతో కలెక్టర్ మాట్లాడి, అవసరమైన మేరకు మరిన్ని కూలీలను అందుబాటులో ఉంచేలా చూడాలని సూచించారు. రోజుకు ఎన్ని లారీలలో లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియ జరుగుతోందని, కార్మికులకు రోజువారీ కూలీలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ధాన్యం అమ్మకాలలో ఆలస్యం, తూకం ప్రక్రియలో పారదర్శకత, చెల్లింపుల జాప్యం వంటి అంశాలను రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైతులు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విన్న కలెక్టర్, వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనలు, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతులు తమ పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన వెంటనే తూకం ప్రక్రియ పూర్తి చేయాలని, ఎలాంటి అనవసర ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. ధాన్యం నాణ్యత పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి, రైతులకు స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో చెల్లింపులు త్వరితగతిన జమయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పండించిన ధాన్యం తడిసిపోకుండా, నాణ్యత దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం జిల్లాలో గుర్తించిన గోదాముల్లో ధాన్యాన్ని భద్రపరిచి, ప్రభుత్వ కేటాయింపుల ప్రకారం సంబంధిత మిల్లులకు సమయానుకూలంగా తరలించాలని తెలిపారు.

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రైతులకు రావలసిన నగదు చెల్లింపులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

హమాలి, రవాణా, లోడింగ్–అన్‌లోడింగ్ ప్రక్రియల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. రైతులు మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, మార్క్‌ఫెడ్ డీఎం తమీన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, నాగర్‌కర్నూల్ ఆర్డీవో సురేష్‌బాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.