కొల్లాపూర్‌లో కళాశాలల కోసం స్థలాల పరిశీలన

కొల్లాపూర్‌లో కళాశాలల కోసం స్థలాల పరిశీలన

ప్రతిపాదిత ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

విద్యా సంస్థల ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధికి ఊతం

నాగర్‌కర్నూల్, (ఆంధ్రప్రభ): కొల్లాపూర్ పట్టణానికి ఇటీవల మంజూరైన హార్టికల్చర్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రతిపాదిత స్థలాల భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం, విద్యాసంస్థల నిర్మాణానికి అనుకూలత, భవిష్యత్ విస్తరణ అవకాశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు కల్పించే విధంగా తగిన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల విస్తరణకు అవకాశం ఉండేలా ప్రణాళికాబద్ధంగా భూములను కేటాయించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హార్టికల్చర్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు వల్ల కొల్లాపూర్ ప్రాంతంలో విద్యా, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.

హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు రైతులకు చేరువయ్యే అవకాశం ఉంటుందని అన్నారు.

భూసేకరణ, భూముల బదిలీ, అనుమతుల మంజూరు వంటి ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు అన్ని ప్రక్రియలను పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *