40 years | మెనోపాజ్ దశలో మహిళలను ఎక్కువగా వేధించే “హాట్ ఫ్లాషెస్” వెనుక అసలు కారణాలేంటి?

40 years | మెనోపాజ్ దశలో మహిళలను ఎక్కువగా వేధించే “హాట్ ఫ్లాషెస్” వెనుక అసలు కారణాలేంటి?
40 years | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : “ఏసీ గదిలో కూర్చున్నా ఒక్కసారిగా చెమటలు పట్టేస్తున్నాయి… రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టడం లేదు… చిన్న విషయానికే చిరాకు వస్తోంది…” — 40 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యలు ఇవే. చాలా మంది ఇవి సాధారణ అలసట, ఒత్తిడి, వయసు ప్రభావం అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వైద్యుల సూచనల ప్రకారం ఇవి మెనోపాజ్‌కు ముందు, తర్వాత కనిపించే కీలక సంకేతాలు.
మహిళల జీవితంలో ఋతుక్రమం శాశ్వతంగా ఆగిపోయే దశను “మెనోపాజ్” అంటారు. సాధారణంగా 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఈ మార్పులు కనిపిస్తాయి. అయితే ఈ దశకు కొన్ని సంవత్సరాల ముందే శరీరంలో హార్మోన్లలో మార్పులు మొదలవుతాయి. ఈ దశను “పెరి-మెనోపాజ్” అని పిలుస్తారు. ఇదే సమయంలో హాట్ ఫ్లాషెస్, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

40 years | హాట్ ఫ్లాషెస్ అంటే ఏమిటి?
ఎలాంటి కారణం లేకుండానే ఒక్కసారిగా శరీరంలో తీవ్రమైన వేడి పాకినట్టుగా అనిపించడం, ముఖం ఎర్రబడటం, చెమటలు పట్టడం — ఇవే హాట్ ఫ్లాషెస్ లక్షణాలు. కొందరికి కొన్ని సెకన్లు మాత్రమే ఉంటే, మరికొందరికి నిమిషాల పాటు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో వచ్చే హాట్ ఫ్లాషెస్‌ను “నైట్ స్వెట్స్” అంటారు. ఇవి నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

వైద్యుల సూచనల ప్రకారం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడు భాగంపై ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుదల ప్రభావం చూపుతుంది. అందుకే శరీరం చిన్న మార్పునే పెద్ద వేడిగా భావించి చెమటలు పట్టేలా చేస్తుంది.
40 years | నిద్రలేమి ఎందుకు వస్తుంది?

మెనోపాజ్ దశలో చాలామంది మహిళలు “నిద్రపోయినా అలసట పోవడం లేదు” అని బాధపడుతుంటారు.. కారణం — మధ్యరాత్రి హటాత్తుగా మెలకువ రావడం. హాట్ ఫ్లాషెస్ కారణంగా ఒక్కసారిగా చెమటలు పట్టి మెలకువ రావచ్చు. మరికొందరికి ఆందోళన, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఫలితంగా గాఢనిద్ర తగ్గిపోతుంది.
నిద్రలేమి ఎక్కువ కాలం కొనసాగితే రక్తపోటు, మధుమేహం, డిప్రెషన్, జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీవనశైలిలో చిన్న మార్పులే పెద్ద ఉపశమనం..
మెనోపాజ్ అనేది వ్యాధి కాదు… శరీరంలో సహజమైన మార్పు మాత్రమే. అయితే ఈ దశను సౌకర్యంగా దాటేందుకు కొన్ని అలవాట్లు సహాయపడతాయి.
ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, యోగా చేయాలి.
రాత్రివేళ టీ, కాఫీ తగ్గించాలి
ఎక్కువ మసాలా, వేడి ఆహారాలు తగ్గిస్తే హాట్ ఫ్లాషెస్ తగ్గే అవకాశం ఉంటుంది
బెడ్ రూం చల్లగా ఉంచుకోవడం మంచిది
నిద్రకు కనీసం గంట ముందు నుంచే మొబైల్ వినియోగం తగ్గించాలి
ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం, శ్వాసాభ్యాసాలు ఉపయోగపడతాయి
కొన్ని సందర్భాల్లో లక్షణాలు తీవ్రమైతే వైద్యులు హార్మోన్ థెరపీ లేదా ఇతర చికిత్సలు సూచిస్తారు. అయితే స్వయంగా మందులు వాడకుండా వైద్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.
ముఖ్యంగా మహిళలు ఈ దశకు భయపడాల్సిన అవసరం లేదు. శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని, సరైన జీవనశైలి పాటిస్తే మెనోపాజ్‌ను కూడా ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు.
(ఈ సమాచార వ్యాసం కేవలం పాఠకులలో ప్రాధమిక అవగాహన కోసం మాత్రమే)
