విద్యా వారోత్సవాల్లో భాగంగా గ్రామ సభ..
దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా దండేపల్లి మండలంలోని రాజుగూడా గ్రామపంచాయతీ పరిధిలోని జైతుగూడా, కుంటలుగూడా, కట్ట గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో గ్రామ సభ నిర్వహించారు.
ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ ఉట్నూరు ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్, స్కూల్ కాంప్లెక్స్, ఆశ్రమ ఉన్నత పాఠశాల జన్నారం ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఎం. శివరాజం మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల యాక్షన్ ప్లాన్)లో భాగంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో బడి ఈడు పిల్లలను గుర్తించి అందరూ బడికి వెళ్లేలా చూడాలని, ఎవరూ బడిబయట ఉండకూడదని అన్నారు.
గ్రామంలోని బడి ఈడు పిల్లలందరినీ 100 శాతం పాఠశాలల్లో నమోదు చేయాలని, డ్రాప్‌అవుట్ శాతాన్ని సున్నాకి తగ్గించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సూచించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహార భోజనం, వసతి, బెడ్‌షీట్లు, కార్పెట్లు, నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, సబ్బులు వంటి కాస్మోటిక్స్, షూస్, యూనిఫార్మ్స్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
పిల్లలను గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించి, నాణ్యమైన విద్య అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌పీ రఘునాథం, స్థానిక ప్రధానోపాధ్యాయులు బి. రూప్లా నాయక్, జే. శంకర్, వార్డు సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
