Nirmal District Boy Vinay Kumar Shines in Sing Geetham Movie | రీల్స్ నుంచి వెండితెరకు.. బాసర బాలుడి టాలీవుడ్ ఎంట్రీ
Nirmal District Boy Vinay Kumar Shines in Sing Geetham Movie | రీల్స్ నుంచి వెండితెరకు.. బాసర బాలుడి టాలీవుడ్ ఎంట్రీ
‘సింగ్ గీతం’తో సినీ రంగంలో అడుగుపెట్టిన గుర్రప్ప వినయ్ కుమార్
సోషల్ మీడియా స్టార్ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు
బాసర, (ఆంధ్రప్రభ): సోషల్ మీడియా వేదికగా రీల్స్, కామెడీ వీడియోలతో వేలాది మంది అభిమానులను సంపాదించిన బాసరకు చెందిన బాలుడు గుర్రప్ప వినయ్ కుమార్ ఇప్పుడు వెండితెరపై మెరిసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన సింగ్ గీతం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
సోషల్ మీడియాతో గుర్తింపు
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రానికి చెందిన గుర్రప్ప రాజేశ్వర్, సరస్వతి దంపతుల కుమారుడు వినయ్ కుమార్ చిన్నప్పటి నుంచే వినోదాత్మక వీడియోలు రూపొందిస్తూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నాడు. తండ్రి ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా కామెడీ, సామాజిక సందేశాలతో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తూ మంచి గుర్తింపు పొందాడు.

తన సహజ నటన, హావభావాలతో ఆకట్టుకున్న వినయ్‌కు సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. అదే గుర్తింపు అతనికి సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
‘సింగ్ గీతం’లో అవకాశం
సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన వినయ్ కుమార్ ‘సింగ్ గీతం’ చిత్రానికి నిర్వహించిన ఆడిషన్స్‌లో ఎంపికయ్యాడు. సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి తన పాత్రకు న్యాయం చేశాడని చిత్రబృందం ప్రశంసించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

చదువుతో పాటు నటన
ప్రస్తుతం బాసరలోని నాగభూషణ విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్న వినయ్ కుమార్, చదువుతో పాటు సోషల్ మీడియాలో సృజనాత్మక వీడియోలు రూపొందిస్తున్నాడు. సామాజిక అవగాహన కల్పించే అంశాలపై కూడా వీడియోలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు.
బాసరకు గర్వకారణం
బాసరకు చెందిన బాలుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించి బాసరకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల స్థానికులు వినయ్ కుమార్‌ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
