మహిళా రిజర్వేషన్ బిల్లుపై దుర్మార్గంగా వ్యవహరించిన కాంగ్రెస్..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై దుర్మార్గంగా వ్యవహరించిన కాంగ్రెస్..
మహిళల హక్కులకు అడ్డంకిగా ప్రతిపక్షాలు..
నినాదాల్లో సాధికారత, చర్యల్లో విరుద్ధం..
మహిళల గళాన్ని అణచివేయడం దారుణం
కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం..
విజయవాడ, ఆంధ్రప్రభ : మహిళల సాధికారతపై సంవత్సరాలుగా నినాదాలు ఇస్తూ వచ్చిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అసలు స్వరూపం దేశం ముందుకు బయటపడిందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం విమర్శించారు. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళల రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళల పట్ల తమ నిజమైన నిబద్ధతను వెల్లడించిందన్నారు. ఈ బిల్లును అడ్డుకోవడం కేవలం రాజకీయ విభేదం కాదని, దేశంలోని కోట్లాది మహిళల ఆశయాలు, హక్కులు, భవిష్యత్తుపై నేరుగా చేసిన దాడిగా అభివర్ణించారు.
మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే చారిత్రాత్మక అవకాశాన్ని స్వార్థ రాజకీయాల కోసం త్యాగం చేయడం రదృష్టకరమన్నారు.ఇలాంటి చర్యలు దేశ చరిత్రలో ప్రజల హక్కులను అణచివేసిన సంఘటనలను గుర్తుకు తెస్తాయని పేర్కొన్నారు. ప్రజల స్వరాన్ని అణచివేయడం ఎప్పటికీ సమర్థనీయం కాదని, అదే విధంగా మహిళల గళాన్ని అణిచే రాజకీయాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
సంవత్సరాలుగా మహిళల పేరుతో ఓట్లు అడిగిన కాంగ్రెస్, నిజంగా వారికి హక్కులు ఇవ్వాల్సిన సమయంలో వెనక్కి తగ్గిందని ఆరోపించారు. మాటల్లో సాధికారతను ప్రస్తావిస్తూ, చేతల్లో మాత్రం అడ్డంకులు సృష్టించడం వారి రాజకీయ సంస్కృతిగా మారిందన్నారు. దేశం మారుతున్నదని, మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగుతూ తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారని చెప్పారు.
అలాంటి సమయంలో మహిళల హక్కులను అడ్డుకునే ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలవవని హెచ్చరించారు. మహిళల అభ్యున్నతికి అడ్డుగా నిలిచిన పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శించారు. దేశం దీనిని గమనిస్తోందని, మహిళలు దీనికి తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.
