అమరావతిపై వైసీపీ మరోసారి విషం చిమ్మే ప్రయత్నం
గద్దె క్రాంతి కుమార్
ఆంధ్రప్రభ పటమట : అమరావతిపై వైసీపీ నాయకులు మరోసారి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ మండిపడ్డారు. శనివారం 6వ డివిజన్ మొగలరాజపురంలో టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పర్యటించారు. ఈ సందర్బంగా క్యాన్సర్ తో మృతి చెందిన టీడీపీ బూత్ కన్వీనర్ పొట్నూరు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, శాసనసభ, హైకోర్టు, ఇతర నిర్మాణాలు వేగంగా జరుగుతూ రాష్ట్ర ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్న సమయంలో, అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ కొత్త నాటకాలకు తెరలేపడం దురదృష్టకరమని అన్నారు
. అమరావతి కోసం 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూములను ఇచ్చి అపూర్వ త్యాగం చేశారని గుర్తు చేశారు. కానీ అధికారంలో ఉన్న సమయంలో ఆ రైతుల త్యాగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాజధాని కోసం ఉద్యమించిన రైతులను, మహిళలను సైతం గౌరవించకుండా పోలీసులతో ఈడ్చించడం, కాళ్లతో తన్నించడం, అక్రమ కేసులు పెట్టించడం వంటి ఘటనలను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. అమరావతి రాజధానిపై తమ నమ్మకం, విశ్వాసాన్ని ఆ ప్రాంత ప్రజలు ఎన్నికల్లోనే స్పష్టంగా చాటిచెప్పారని గద్దె క్రాంతి కుమార్ అన్నారు.
రాజధాని పరిధిలోని ప్రజలు వైసీపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా తీర్పు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా మళ్లీ అమరావతిపై విషప్రచారం చేయడం వైసీపీ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులు పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని, అధికారం కోల్పోయిన తర్వాత ‘మావిగన్’ పేరుతో మరోసారి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇప్పుడు రైతుల ముసుగులో కొందరిని ముందు పెట్టి అమరావతిలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులను స్థానిక రైతులు ప్రశ్నించి అడ్డుకుంటే, ఆ రైతులనే ‘రౌడీలు’ అని అవమానించడం అత్యంత సిగ్గుచేటని గద్దె క్రాంతి కుమార్ అన్నారు.
నిజంగా రైతుల పట్ల గౌరవం ఉంటే వారి తీర్పును గౌరవించాల్సిందిపోయి, వారిపైనే దుష్ప్రచారం చేయడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. అప్పుడు రైతుల బాధలు కనిపించని వైసీపీ నాయకులు, ఇప్పుడు రైతుల పేరుతో కొంతమందిని అడ్డుపెట్టుకొని రాజకీయ డ్రామాలు ఆడటం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనని అన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ అసలు లక్ష్యమని, అందుకే ప్రతి సందర్భంలో రాజధానిపై విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. అమరావతి అంటే వైసీపీకి ఎందుకంత ద్వేషమో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని గద్దె క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని, అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అని, దాని అభివృద్ధిని ఎలాంటి శక్తులు అడ్డుకోలేవని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్, మజ్జి రామినాయుడు, మొకర రామారావు, రాచమళ్ళురాము, కండుబోతు దుర్గారావు, పడాల వాసు తదితరులు ఉన్నారు.
