మే డే ఉత్సవాలు జయప్రదం చేయాలి
మే డే ఉత్సవాలు జయప్రదం చేయాలి
- సీపీఐ నేత ధూళిపాల పిలుపు
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : మే 1న జరిగే ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాల ధనుంజయ నాయుడు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో సీపీఐ అనుబంధ ప్రజా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. ఎనిమిది గంటల పని విధానం కోసం అమెరికాలో ప్రారంభమైన కార్మిక సమ్మెల ఫలితంగా ఈ హక్కు సాధించబడిందని, ఆ చారిత్రాత్మక పోరాటానికి గుర్తుగా మేడే జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం పది గంటల పని విధానాన్ని అమలు చేస్తోందని, గతంలో సాధించిన 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరించిందని విమర్శించారు. కార్మికులకు సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు తగ్గించడంతో పాటు సమ్మె హక్కును కూడా పరిమితం చేస్తున్నారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాల్లో ఎన్డీఏ కూటమికి ఎదురుదెబ్బలు తప్పవని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, పట్టణ అధ్యక్షుడు పరికె భరత్, శీలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
