మోడీ వినూత్న కార్యాచరణ
మోడీ వినూత్న కార్యాచరణ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ ముందడుగేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్భోదించిన పొదుపు మంత్రం పఠిస్తోంది. ముఖ్యంగా ఇంధన వాడకం తగ్గింపు విషయంలో ఆదా మార్గంను అనుసరిస్తోంది. స్వయంగా ప్రధానమంత్రే పొదుపు దిశగా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. తన కాన్వాయ్లోని వాహనాలను భారీగా తగ్గించుకున్నారు.
బుధవారం కేవలం రెండు వాహనాలతోనే మోడీ కాన్వాయ్ నడిచింది. ఇక ఇదే బాటలో పలువురు కేంద్ర మంత్రులు ముందుకు సాగుతున్నారు. కాన్వాయ్ కట్.. మెట్రోరైడ్ వంటి వినూత్న చర్యలతో పౌరులకు ఆదర్శంగా నిలిచారు. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలూ మోడీ సూచించిన పొదుపు సూత్రం పిలుపును అందిపుచ్చుకున్నాయి. కాన్వాయ్ వాహనాలను తగ్గించుకోవడంతో పాటు, అధికారిక పర్యటనలో బైక్, కార్ ర్యాలీలకు బ్రేకులు లేశారు. అధికార వర్గాలకూ ఈమేరకు నిర్దిష్ట ఆదేశాలు జారీచేశారు.
ప్రధాని, ముఖ్యమంత్రుల మాదిరిగానే కొందరు అధికారులూ ఇంధన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఛత్తీస్గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు ఇద్దరు కార్లను పక్కనబెట్టి, కార్యాలయానికి సైకిల్పై వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇంధన పొదుపు ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. దేశం కోసం ప్రధాని మోడీ సూచించిన నవ సూత్రాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు సంక్షోభ పరిస్థితుల వేళ… యావత్ దేశం ఇలా ఇంధన పొదుపు వైపు అడుగులేస్తోంది.
స్ఫూర్తిగా నిలిచిన ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ లోని వాహనాల సంఖ్య భారీగా తగ్గింది. కేవలం రెండు వాహనాల కాన్వాయ్తోనే ఆయన ప్రయాణిస్తున్నారు. ఇంధన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మోడీ ఈ మార్పులు చేశారు. పొదుపు మంత్రం పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన వేళ తానే స్వయంగా పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా ప్రధాని కాన్వాయ్లో సాయుధ మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్650 గార్డ్, రేంజ్ రోవర్లు, టయోటా ఫార్చ్యూనర్లు, ఎస్కార్ట్ వాహనాలు, జామర్ యూనిట్లతో సహా కనీసం 12-15 వాహనాలు ఉంటాయి. ఇందులో 50 OL4CCB1111 శాతం తగ్గించాలని ప్రధాని ఆదేశించినట్లు ఎస్పీజీ అధికారులు వెల్లడించారు.
మోడీ మాట.. కేంద్రమంత్రుల బాట.. ప్రధానమంత్రి పిలుపు మేరకు కేంద్ర మంత్రులు కూడా తమ తమ కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను కుదించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి ఉపరితల రవాణాశాఖ మంత్రి గడ్కరీ వరకు కాన్వాయ్ సైజును తగ్గించుకున్నారు. తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించినట్లు గడ్కరీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మరికొందరు కేంద్రమంత్రులు కపిల్ మిశ్రా, రాందాస్ అథవాలే తదితరులు తమ కార్యాలయాలకు చేరుకునేందుకు ప్రజా రవాణాను ఆశ్రయించారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. పొదుపు చర్యలలో మేము సైతం అంటూ ముందడుగేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ..
ప్రధాని మోడీ సూచించిన పొదుపు చర్యలను పాటించేందుకు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగేశాయి. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, యూపీ వరకు ముఖ్యమంత్రులు, మంత్రులు వీఐపీ సంస్కృతిని కాస్త పక్కనబెట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ వర్గాలకూ నిర్దిష్ట ఆదేశాలు జారీచేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం తమ కేబినెట్ మంత్రులకు నిర్దిష్ట ఆదేశాలు జారీచేసింది. అనవసర విమాన ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరింది. ఈ క్రమంలో మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్ ఫ్రాన్స్ పర్యటనను రద్దుచేసుకున్నారు. వాస్తవానికి ఆయన అక్కడ జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు. అలాగే, జపాన్ స్టడీ టూర్కి వెళ్లాల్సిన 22 మంది ఎమ్మెల్యేల షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయిందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. ఇక పర్యాటక మంత్రి శంభురాజ్ దేశాయ్ సైతం యూరప్‌కు ఫ్యామిలీ ట్రిప్‌ను రద్దు చేసుకున్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 13 నుంచి 8కి తగ్గించుకున్నారు. వాహన ర్యాలీలకు దూరంగా ఉండాలని మంత్రులు, ఆఫీస్ బేరర్లను నాయబ్‌సింగ్ సైనీ ఆదేశించారు. బీజేపీ నేత సౌభాగ్య ఠాకూర్ 200 వాహనాలతో ర్యాలీ చేపట్టిన అంశం వివాదాస్పదం కావడంతో ముఖ్యమంత్రి ఇంధన పొదుపుపై స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బుధవారం కేవలం మూడు వాహనాల కాన్వాయ్ను ఉపయోగించారు. మరికొందరు మంత్రులు తమకు ఎస్కార్ట్ వాహనాలు అక్కర్లేదని స్పష్టంచేశారు. హెలికాప్టర్ ప్రయాణాలకు మంత్రులు, అధికారులు దూరంగా ఉండాలని గుజరాత్ ప్రభుత్వం నిర్దిష్ట ఆదేశాలిచ్చింది. ఢిల్లీ, యూపీ ముఖ్యమంత్రులు సైతం పొదుపు చర్యలను పాటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
