Flex Banner | తలెత్తిన ఆధిపత్య పోరు..

Flex Banner | తలెత్తిన ఆధిపత్య పోరు..

Flex Banner | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్నిన్నటి దాకా బద్ద శత్రువులు.. నేడు ఒకే కూటమిలో ఉన్నా అధిపత్య పోరు మాత్రం ఆగలేదు. తాజాగా ఓ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో వేయలేదనే కారణంతో.. ఎస్విఎస్ వర్మ, పెండెం దొరబాబుల మధ్య మాటల దశాబ్దాల రాజకీయ వైరానికి ఆజ్యం పోసింది.

ఎవరెవరి మధ్య వైరం?

పిఠాపురం రాజకీయాల్లో వర్మ, దొరబాబు దాదాపు రెండు దశాబ్దాలుగా ఒకరికొకరు బద్ధ శత్రువులు. 2014లో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీకి దగ్గరవగా, 2019లో దొరబాబు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎప్పుడూ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు రాజకీయాలు నడిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో దొరబాబు ఆ పార్టీకి దూరమయ్యారు. అనంతరం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీలో చేరారు.

Flex Banner

ఎక్కడ మొదలైంది వివాదం?

పిఠాపురంలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను మాత్రమే హైలైట్ చేసి, సీఎం చంద్రబాబు ఫోటోను ముద్రించలేదు. దీనిని గమనించిన వర్మ, అక్కడున్న స్థానిక జనసేన నేత తుమ్మల బాబును నిలదీశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పెండెం దొరబాబు కలగజేసుకోవడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి, టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాటకు దారితీసింది.

Flex Banner

ఎందుకు రాజుకుంటోంది?

2019-2024 మధ్య వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో దొరబాబు తమను, తమ పార్టీ (టీడీపీ) కేడర్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని వర్మ వర్గం ఆరోపిస్తోంది. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి, జనసేనలో ఎలా ప్రోత్సహిస్తారని వర్మ వర్గం చాలాకాలంగా రగిలిపోతోంది. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో పాత శత్రువులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

2024 ఎన్నికల్లో కూటమి ధర్మంలో భాగంగా వర్మ తన సీటును పవన్ కళ్యాణ్‌కు త్యాగం చేశారు. పవన్ గెలుపు కోసం అందరూ కలిసి పని చేసినప్పటికీ, ఎన్నికల తర్వాత స్థానిక జనసేన ద్వితీయ శ్రేణి నాయకులకు, వర్మకు మధ్య తీవ్ర సమన్వయ లోపం ఏర్పడింది. పవన్ పర్యటనలు మినహా, మిగతా సమయాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈనాటి గొడవకు ‘చంద్రబాబు ఫోటో లేకపోవడం’ అనేది కేవలం ఒక సాకు మాత్రమే. ఒకే నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉన్న నాయకులు ఇద్దరూ ఇప్పుడు ఒకే కూటమి గొడుగు కిందకు రావడంతో తలెత్తిన ఆధిపత్య పోరే ఈ ఘర్షణకు అసలు కారణం.

Flex Banner

Leave a Reply