Parvathipuram | ఆ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు..

Parvathipuram | ఆ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు..

మూఢనమ్మకాల కారణంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక దారుణ హత్య వెలుగుచూసింది. చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ యువకుడిని అంతమొందించిన ఈ సంచలన కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ ఘోరానికి పాల్పడిన 16 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది?

వెలగవలస గ్రామానికి చెందిన తాడంగి రమేష్ (30) అనే యువకుడు చేతబడులు చేస్తున్నాడంటూ కొందరు గ్రామస్తులు అనుమానించారు. ఈ క్రమంలోనే అతనిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు, రాత్రికి రాత్రే మృతదేహాన్ని శ్మశానానికి తరలించి దహనం చేయడానికి నిందితులు ప్రయత్నించారు.

మృతదేహాన్ని తగలబెడుతున్నారనే సమాచారం అందిన వెంటనే రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. శ్మశానానికి చేరుకుని దహన కార్యక్రమాలను అర్ధాంతరంగా అడ్డుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతుడి సోదరుడు శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్ప‌టికే ఈ కేసులో 16 మందిని అదుపులోకి తీసుకోగా.. ఈ హత్యతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి అధికారికంగా వెల్లడించారు. మూఢనమ్మకాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply