ఎస్సీ రిజర్వేషన్లు 25 శాతానికి పెంచాలి
ఎస్సీ రిజర్వేషన్లు 25 శాతానికి పెంచాలి
ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం వినతి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జనాభా ప్రాతిపదికన ఎస్సీల రిజర్వేషన్లను 25 శాతానికి పెంచాలని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. దళితులకు మత స్వేచ్ఛ కల్పిస్తూ, ఏ మతాన్ని అనుసరించినా ఎస్సీ హోదా రద్దు కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌కు వినతిపత్రం అందజేశారు.
మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల సుబ్బన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి భక్తుల రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్, ప్రతాప్, జిల్లా కార్యదర్శి సోమయ్య, జిల్లా ట్రెజరర్ గుడిపల్లి సుజిత్ ఆధ్వర్యంలో వినతులు సమర్పించారు.
జీవో నంబర్ 342 ప్రకారం ఎస్సీ ఉపాధ్యాయులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనుమతి మంజూరు చేసే అధికారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు అప్పగించాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్సీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సంఘం నాయకులు కోరారు. దళితులకు మత స్వేచ్ఛను కల్పించే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో రోస్టర్ బుక్ నిర్వహణ తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల్లో క్యాడర్ స్ట్రెంత్ ప్రకటించి, రిజర్వేషన్ రోస్టర్లను పరిశీలించాలని, అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.
కారుణ్య నియామకాలలో ఎస్సీ అభ్యర్థులకు వెంటనే అపాయింట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
ఎస్సీ విద్యార్థుల హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని, ప్రతి మండల కేంద్రంలో ఎస్సీ విద్యార్థుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎస్సీ వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎస్సీ ఉద్యోగులు పాల్గొన్నారు.
